PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 6:15 am Posted by : srinivaskadarisrinivaskadari0@gmail.com

ప్రజావాణి లో దరఖాస్తు తీసుకొని అధికారి పై చర్యలు తీసుకోవాలి

బెజ్జూర్ మండలం సెప్టెంబర్ 28:

ప్రజల సమస్యలు, ఫిర్యాదులు, వినతులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలోనే దరఖాస్తు స్వీకరణకు నిరాకరణ ఎదురవడం చర్చనీయాంశంగా మారింది. బెజ్జూర్ మండలంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కౌటాల మండలం తాటినగర్ గ్రామానికి చెందిన దుర్గం శరత్ చంద్ర సమర్పించేందుకు తీసుకెళ్లిన దరఖాస్తును ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ స్వీకరించకుండా తిరస్కరించారని ఆర్టీఐ కార్యకర్తలు పేర్కొన్నారు.దుర్గం శరత్ చంద్ర ఆర్టీఐ కార్యకర్తగా, మానవ హక్కుల సంఘం సిర్పూర్–టి నియోజకవర్గ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం కోరే ఆర్టీఐ కార్యకర్తలకు ఇబ్బందులు, అభ్యంతరాలు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజావాణిలో దరఖాస్తు సమర్పించేందుకు వెళ్లినట్లు తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించే వినతులను నమోదు చేసి, సంబంధిత అంశాలను పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన ప్రజావాణిలో దరఖాస్తు స్వీకరణకే నిరాకరణ ఎందుకు జరిగిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరించే విధానం, వాటి నమోదు, సంబంధిత అధికారులకు పంపించే ప్రక్రియకు సంబంధించి నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ దరఖాస్తును స్వీకరించకపోవడంపై ఆర్టీఐ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దరఖాస్తును స్వీకరించకపోవడానికి కారణాలు ఏమిటి, ఏ నిబంధనల ఆధారంగా తిరస్కరించారు అనే విషయాలను అధికారులు స్పష్టం చేయాలని కోరుతున్నారు.ఈ ఘటనపై కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని ఆర్టీఐ కార్యకర్తలు డిమాండ్ చేశారు. దరఖాస్తును ఎందుకు స్వీకరించలేదనే అంశంపై ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ నుంచి వివరణ తీసుకోవాలని కోరారు. ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం స్వీకరించేలా స్పష్టమైన చర్యలు తీసుకోవాలని, దరఖాస్తుదారులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. దరఖాస్తు తిరస్కరణపై విచారణ జరిపి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆర్టీఐ కార్యకర్తలు కోరారు.