PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 5:12 pm Posted by : PORU TELANGANA

శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి… మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలి సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దు… డీజేలకు అనుమతులు లేవు: పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిశోర్ ఝా, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, అన్ని మతాల పెద్దలతో శాంతి సమావేశం

పెద్దపల్లి//రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో, మత సామరస్యం, సోదరభావంతో నిర్వహించేందుకు పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలోని అన్ని వర్గాల మతపెద్దలు, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులతో పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆధ్వర్యంలో శాంతి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని మతాల పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులతో శాంతి సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజంలో శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మతపెద్దలు, సమాజంలోని పెద్దలు తమ పరిధిలోని ప్రజలకు, ముఖ్యంగా యువతకు శాంతి, సంయమనం, పరస్పర గౌరవం పాటించేలా అవగాహన కల్పించాలని కోరారు.ఎక్కడైనా చిన్నపాటి సంఘటన లేదా వివాదం జరిగినప్పుడు ఆవేశానికి లోనై ఎక్కువ మందిని సమీకరించకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమస్యలను ఎవరూ స్వయంగా పరిష్కరించేందుకు ప్రయత్నించకూడదన్నారు. వినాయక విగ్రహాల ఏర్పాటు ప్రాంతాల్లో ఏవైనా సమస్యలు తలెత్తినా, నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి ట్రాఫిక్, రహదారులు, నిమజ్జన సమయం, విగ్రహాల సంఖ్య తదితర అంశాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నా ముందుగానే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పరిస్థితులను పరిశీలించి అవసరమైన సమన్వయం, భద్రతా ఏర్పాట్లపై పోలీస్ శాఖ తగిన సూచనలు,చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా అన్ని మతాల విశ్వాసాలు, ప్రార్థనా స్థలాలు, ప్రజల మనోభావాలను గౌరవిస్తూ సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా శోభాయాత్ర మసీదులు,ఇతర ప్రార్థనా స్థలాలు లేదా ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల మీదుగా వెళ్లే సమయంలో స్థానిక మతపెద్దలు,ఉత్సవ కమిటీ సభ్యులు ముందుగానే సమన్వయం చేసుకోవాలని తెలిపారు.నమాజ్ సమయాలు, శోభాయాత్ర మార్గాలకు సంబంధించి ఏవైనా ప్రత్యేక అంశాలు ఉంటే ముందుగానే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నినాదాలు చేసినా లేదా సోషల్ మీడియాలో వివాదాస్పద, అసత్య సమాచారాన్ని ప్రచారం చేసినా వెంటనే స్పందించకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఆవేశపూరిత ప్రతిస్పందనల వల్ల చిన్న సమస్య పెద్ద వివాదంగా మారే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించడం పోలీస్ శాఖ ఒక్కదాని బాధ్యత కాదని, అన్ని మతాల పెద్దలు, ఉత్సవ కమిటీలు, ప్రజలు పరస్పర సమన్వయంతో, బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే మత సామరస్యం, శాంతి, సోదరభావం కొనసాగుతాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.

డీజేలకు అనుమతులు లేవని, నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఉత్సవాలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని వర్గాల ప్రజలు పోలీస్ శాఖకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.

ఈ సమావేశంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు భీమేష్, శ్రీనివాస్, బెల్లంపల్లి ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రావు, ఎస్‌ఐలు మనోహర్, రాజేందర్, చంద్రశేఖర్, సంధ్యారాణి,శ్రీలత, మతపెద్దలు,ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు