PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 5:20 pm Posted by : PORU TELANGANA

ప్రత్యేక హోదా.. విభజన హామీల అమలే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ లక్ష్యం

ప్రత్యేక హోదా.. విభజన హామీల అమలే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ లక్ష్యం

హోదా సాధిద్దాం.. ఆంధ్రకు వెలుగునిద్దాం

విభజన హామీల అమలుకు పోరాడదాం

రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ జిల్లా ప్రతినిధులు ఆర్ కె నాయుడు,శిఖా నాగమణి లు వెల్లడి

గుంటూరు :-
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనతో పాటు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయించడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఆర్.కె. నాయుడు, గుంటూరు జిల్లా అధ్యక్షురాలు శిఖా నాగమణి తెలిపారు. బుధవారం గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా గత, ప్రస్తుత ప్రభుత్వాలు రాష్ట్రానికి తగిన న్యాయం చేయలేకపోతున్నాయని ఆర్.కె. నాయుడు విమర్శించారు. గతంలో ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పోరాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కూడా అదే స్థాయిలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా లభిస్తే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే వరకు, విభజన హామీల అమలు జరిగే వరకు తమ పార్టీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాను హక్కుగా సాధించేందుకు పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. అవసరమైతే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్థాయిలో కూడా ఈ అంశాలను ప్రస్తావించి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతామని ఆర్.కె. నాయుడు వెల్లడించారు.

గుంటూరు జిల్లా అధ్యక్షురాలు శిఖా నాగమణి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన అత్యంత దురదృష్టకర పరిస్థితుల్లో జరిగిందన్నారు. విభజన అనంతరం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలే తమ పార్టీ ప్రధాన అజెండా అని తెలిపారు.

రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌లో మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నామని, గ్రామస్థాయిలో పార్టీ కార్యకర్తలు ప్రజలకు ప్రత్యేక హోదా, విభజన హామీలపై అవగాహన కల్పిస్తున్నారని నాగమణి చెప్పారు.

రాబోయే మున్సిపల్, మండల, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ సిద్ధంగా ఉందని, భవిష్యత్తులో జరిగే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీకి సంసిద్ధంగా ఉన్నామని ఆర్.కె. నాయుడు, నాగమణి తెలిపారు.

ఈ కార్యక్రమంలో హోదాసాధిద్దాం ఆంధ్రకువెలుగునిద్దాం,విభజనహామీలు..అమలుచేయాలి, ప్రత్యేకహోదా..ఆంధ్రప్రదేశ్‌హక్కు అని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్,నాగిరెడ్డి,శిరీష,కాశింబి,సైదాబి, మల్లమ్మ,రోహిణి,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.