పోరు తెలంగాణ అక్టోబర్ 24: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.
కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో యూఐడీఎఫ్ నిధులు రూ.18.70 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనుల టెండర్లలో అక్రమాలు జరిగాయని, వీటిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ముంజం ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.గుత్తేదారులు కూటమిగా ఏర్పడి టెండర్లు దాఖలు చేశారని, పర్సంటేజీల రూపంలో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై పత్రికల్లోనూ కథనాలు వచ్చాయని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ విచారణ చేపట్టడం మంచి పరిణామమే అయినా, కేవలం దస్తావేజులు పరిశీలించి నివేదిక ఇవ్వడంతో ఈ వ్యవహారం ముగియకూడదన్నారు.వినతిపత్రంలో పేర్కొన్న ప్రధాన డిమాండ్లు అన్ని పనుల టెండర్ నోటిఫికేషన్లు, బిడ్డింగ్ వివరాలు, అంచనా వ్యయాలు, వర్క్ ఆర్డర్లను పరిశీలించాలి కాంట్రాక్టర్ల కుమ్మక్కు, ముందస్తు ఒప్పందాలు, పర్సంటేజీల పంపకాలపై ఆధారాలతో విచారణ జరపాలి విచారణ పూర్తయ్యేవరకు సంబంధిత పనుల తదుపరి చర్యలను నిలిపివేయాలి అక్రమాలు తేలితే టెండర్లు రద్దుచేసి, పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలి బాధ్యులైన కాంట్రాక్టర్లను అనర్హులుగా ప్రకటించాలి, అధికారులపై శాఖాపరమైన, అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఇప్పటికే ప్రారంభమైన, పూర్తయిన పనుల నాణ్యత, వ్యయాన్ని స్వతంత్రంగా తనిఖీ చేయాలి విచారణ నివేదికను ప్రజలకు వెల్లడించాలి ప్రజాధనాన్ని దోచుకునే ప్రయత్నాలకు అవకాశం ఇవ్వకూడదని, రాజకీయ పలుకుబడి లేదా కాంట్రాక్టర్ల ప్రభావంతో ఎవరూ తప్పించుకోకూడదని వారు స్పష్టం చేశారు. ఆరోపణల్లో నిజానిజాలను నిష్పక్షపాత విచారణ ద్వారా తేల్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాదారపు శ్రీనివాసరావు, బొర్కుట్ రాజేందర్, కోట శ్రీనివాస్ పాల్గొన్నారు.