వాంకిడి అక్టోబర్ 01:
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం
సరండి గ్రామపంచాయతీ పరిధిలో పరిశుభ్రత, పచ్చదనం పెంపునకు సర్పంచ్ మొహార్లే బాపూజీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. గ్రామంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారులపై పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు.రహదారులపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని, నిర్ణీత ప్రదేశాల్లోనే వేయాలని ఆయన సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. రహదారులు, వీధులు, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో పారిశుధ్య సిబ్బందితో క్రమం తప్పకుండా శుభ్రత పనులు చేయిస్తున్నామని, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పచ్చదనం పెంపులో భాగంగా గ్రామంలోని పాఠశాల సమీపంలో మొక్కలు నాటారు. విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ఇవి దోహదపడతాయని సర్పంచ్ తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, క్రమం తప్పకుండా నీరు పోయాలని సూచించారు. మొక్కల సంరక్షణలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా భాగస్వాములు కావాలని కోరారు. గ్రామంలోని ప్రతి ఖాళీ స్థలంలో వీలైనన్ని మొక్కలు నాటాలని గ్రామపంచాయతీ నిర్ణయించినట్లు చెప్పారు.గ్రామాభివృద్ధిలో రహదారుల పరిశుభ్రత, పారిశుధ్యం, పచ్చదనానికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రజల సహకారంతో సరండిని పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని సర్పంచ్ మొహార్లే బాపూజీ పేర్కొన్నారు.