కాగజ్ నగర్ అక్టోబర్ 02:
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ లో గాంధీ జయంతి సందర్భంగా కాగజ్‌నగర్ బస్టాండ్ ఆవరణలో సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు “క్లీన్ అండ్ గ్రీన్” కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మరుగుదొడ్లను శుభ్రం చేశారు. ఆవరణలోని చెత్తను పూర్తిగా తొలగించి చెట్లు నాటారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో స్వచ్ఛ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది ఇళ్లకు మరుగుదొడ్లు నిర్మించి, మహిళల ఆత్మగౌరవానికి పెద్దపీట వేశారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఆ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.
ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని దోమల వ్యాప్తిని అరికట్టాలని, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడాలని బస్టాండ్‌లోని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండవని, పిల్లలకు పరిశుభ్రతపై తల్లిదండ్రులు మార్గదర్శనం చేయాలని సూచించారు. అనంతరం ప్రయాణికులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.