నిరుద్యోగ యువతకు శుభవార్త.. ఉచితంగా 8 రోజుల ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శిక్షణ!
శిక్షణతో పాటు ఉచిత భోజనం, వసతి.. శిక్షణ పూర్తి చేసిన వారికి రూ.4,000 ఆర్థిక ప్రోత్సాహకం
ఖమ్మం: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు, వ్యాపార రంగంలో రాణించేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కాస్ట్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (PMAJAY), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ni-MSME) వారి సహకారంతో 8 రోజుల ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (EDP) శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు.
వ్యాపార రంగంలో స్థిరపడాలని, స్వయం ఉపాధి పొందాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడనుంది. ఎనిమిది రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనే అభ్యర్థులకు ఉచిత భోజనంతో పాటు హాస్టల్ వసతి కల్పించనున్నారు.
అంతేకాకుండా శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు EDP శిక్షణ సర్టిఫికెట్ అందజేయనున్నారు. శిక్షణకు హాజరై విజయవంతంగా పూర్తి చేసిన వారికి రోజుకు రూ.500 చొప్పున మొత్తం రూ.4,000 ఆర్థిక ప్రోత్సాహకాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు నిర్వాహకులు పోస్టర్ ద్వారా వెల్లడించారు.
కావలసిన ధ్రువీకరణ పత్రాలు:
1. విద్యార్హత ధ్రువీకరణ పత్రం
2. తెలుగు రేషన్ కార్డు
3. కుల ధ్రువీకరణ పత్రం
4. ఆధార్ కార్డు
5. పాన్ కార్డు
6. బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ
శిక్షణ జరిగే ప్రదేశం:
D.No. 1-3-133/1, D.A.R. క్యాంపస్, మహబూబాబాద్ ఎక్స్ రోడ్స్, సత్యనారాయణపురం, ఖమ్మం, తెలంగాణ – 507003.
స్వయం ఉపాధి సాధించాలనే ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.