PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 4:45 pm Posted by : PORU TELANGANA

చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్… రూ.2.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం: వైరా సిఐ

జిల్లా :- తల్లాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు ఇంటి చోరీ కేసులను తల్లాడ పోలీసులు ఛేదించారని, ఈ కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వైరా సిఐ వెంకటప్రసాద్ తెలిపారు.

రెండు ఇంటి చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న జంగాల స్వరూప్ కుమార్ ( శాంతి స్వరూప్ ) వినయ్ కుమార్, వయస్సు 41 సం,,ను శుక్రవారం ఉదయం తల్లాడ బస్ స్టాండ్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు.

ఏప్రిల్ 11న గంగదేవిపాడు గ్రామానికి చెందిన సిలివేరు నరసింహారావు వ్యక్తిగత పనిమీద బయటకు వెళ్లగా, ఆయన భార్య కూలి పనికి వెళ్లారు. మద్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన నరసింహారావు ఇంటి వాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. ఇంట్లోని ఇనుప బీరువాను కూడా పగులగొట్టి, అందులో భద్రపరిచిన బంగారు ఆభరణాలు చోరికి గురైనట్లు గుర్తించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని విదారించగా, గంగదేవిపాడు గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించి, తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి ఇనుప బీరువాను పగులగొట్టి బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు వెల్లడించాడు.

అదేవిధంగా…తల్లాడ ఎస్సై ఎన్.వెంకటకృష్ణ ఆధ్వర్యంలో  నిర్వహించిన నిందితుడి విచారణలో తల్లాడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో నిందితుడు తల్లాడలో తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించి, ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి రెండు బంగారు ఉంగరాలను చోరీ చేసినట్లు వెల్లడించాడని తెలిపారు. అనంతరం ఆ బంగారు ఉంగరాలను గన్నవరం ప్రాంతంలోని S.R. బంగారం దుకాణంలో విక్రయించినట్లు విచారణలో తెలిపారన్నారు.

*నిందితుడి నేర చరిత్ర*

దర్యాప్తులో నిందితుడికి గతంలో కూడా పలు చోరీ, ఇంటి దొంగతనం కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు ప్రాధమికంగా గుర్తించామని, వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అతనిపై నమోదైన పాత కేసుల వివరాలను సంబంధిత పోలీస్ రికార్డుల ద్వార పరిశీలించినట్లు, నిందితుడి ప్రమేయం ఉన్న ఇతర ఆస్తి నేరాలను కూడా గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను పంచుల సాక్షుల సమక్షంలో చట్టపరమైన విధానంలో స్వాదీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గౌరవ న్యాయస్థానం ఎదుట రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు.

*తల్లాడ పోలీసుల విజ్ఞప్తి*

ప్రజలు ఇళ్లను ఖాళీగా ఉంచి బయటకు వెళ్లే సమయంలో విలువైన వస్తువులను ఇంట్లో బహిరంగంగా ఉంచకుండా తగిన భాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో సొరుగువారికి సమాచారం ఇవ్వడం, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించడం ద్వారా చోరీలను నివారించవచ్చని తెలిపారు.