మంచిర్యాల జిల్లా
పచ్చదనాన్ని కాపాడటం ద్వారా సమతుల్య వాతావరణం..జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
పోరుతెలంగాణ డిజిటల్ డెస్క్ :-
మొక్కలు నాటి సంరక్షించి పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా సమతుల్య వాతావరణాన్ని నిర్మించవచ్చని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని మందమర్రి మండలం బొక్కలగుట్ట ప్రాంతంలోని గాంధారి వనంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్ లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా భావితరాలకు సహజమైన సమతుల్య వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. చెట్ల ద్వారా మనకు కావలసిన సహజవాయువు, ఆరోగ్యకరమైన ఆహారం, ఆశ్రయం లభిస్తాయని, వర్షాలు సమృద్ధిగా ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మంగళవారం రోజున 4 లక్షల మొక్కలను నాటడం జరిగిందని, జిల్లాకు నిర్దేశించిన 41 లక్షల మొక్కల లక్ష్యాన్ని దాదాపు 80 శాతం పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటడమే కాకుండా సంరక్షించాలని, సమతుల్య వాతావరణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని తెలిపారు.
అనంతరం మందమర్రి మండల కేంద్రంలోని ఆర్.కె. గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన రెండు పడక గదుల ఇండ్ల లబ్ధిదారుల లక్కీ డ్రా కార్యక్రమానికి డి.సి.పి., మందమర్రి మున్సిపల్ కమిషనర్ రాయలింగు, మండల తహసిల్దార్ సతీష్ కుమార్, ఇందిరమ్మ ఇండ్లు పి.డి. బన్సీలాల్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు రెండు పడక గదుల ఇండ్ల పథకంలో ఇండ్లు కేటాయించడం జరుగుతుందని, ఈ క్రమంలో పారదర్శకమైన కేటాయింపు కొరకు అర్హులైన లబ్ధిదారులకు లక్కీ డ్రా నిర్వహించి ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పథకం చేపట్టి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. రెండు పడక గదుల ఇండ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా లక్కీ డ్రా పద్ధతిన పారదర్శకంగా ఇండ్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.