*గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం… రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు*
గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి
సెప్టెంబర్04//:
ఖమ్మం-కూసుమంచి, సెప్టెంబర్-
గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచి మండలం కేశవాపురం గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత రెండున్నర ఏళ్లలో కేశవాపురం గ్రామానికి రూ. 4 కోట్ల నిధులు మంజూరు చేసి, అభివృద్ధి పనులు చేశామన్నారు. ఇందులో రూ. 40 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, రూ. 3.30 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటు ఎలక్ట్రికల్ లైన్లు, అంగన్‌వాడీ కేంద్రం, మంచినీటి సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేశామన్నారు.
పేద మహిళలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నామన్నారు. నిరుపేదల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మొదటి విడతలో 4.5 లక్షల ఇళ్లు, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామన్నారు. మూడో విడత, నాల్గో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, అర్హులైన ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి అన్నారు.
రైతును రాజు చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత రెండున్నర ఏళ్లలో రైతు రుణమాఫీ, రైతు భరోసాతో కలిపి మొత్తం రూ. 1,76,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ. 500 బోనస్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
నిరుద్యోగ యువతకు భరోసానిస్తూ ఇప్పటివరకు 72,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. మరో 11,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద రూ. 67,000 కోట్లు విడుదల చేశామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అక్కడక్కడా ఉన్న యురియా కొరత సమస్యను ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిసివో గంగాధర్, జిల్లా వ్యవసాయ అధికారి డి. పుల్లయ్య, పిఆర్ ఎస్ ఈ వెంకట్ రెడ్డి, డీపీవో వినోద్ కుమార్, హౌసింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, కూసుమంచి మండల తహశీల్దార్ సైదులు, కేశవాపురం గ్రామ సర్పంచ్ బానోతు మమత, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.