PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 6:27 am Posted by : srinivaskadarisrinivaskadari0@gmail.com

జైనూర్ లో యువతకు ఎస్పీ పిలుపు.

పోరు తెలంగాణ అక్టోబర్ 12: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి

జైనూర్ మండలం మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహనలో భాగంగా కుమురం భీం ఆసిఫాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో జైనూర్‌లో డివిజన్ స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఈ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. యువతలో క్రీడా స్ఫూర్తి, శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, ఐకమత్యం పెంపొందించడమే లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని యువతతో ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు.ఎస్పీ మాట్లాడుతూ, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ ఆసక్తి పెంచుకుని తమ ప్రతిభను వెలికితీయాలన్నారు. క్రీడలు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అందిస్తాయని చెప్పారు. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపై కూడా దుష్ప్రభావం చూపుతుందని, వాటికి దూరంగా ఉండి భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. టోర్నమెంట్‌లో పాల్గొన్న 65 జట్ల క్రీడాకారులు తమ గ్రామాల్లో మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టీ షర్టులు, క్యాప్‌లు పంపిణీ చేశారు. యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచేందుకు ఇలాంటి క్రీడా పోటీలు, అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమం నిర్వహించిన పోలీసు అధికారులను అభినందించారు.