పోరు తెలంగాణ అక్టోబర్ 16: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.కాగజ్‌నగర్ మండలం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ – సీఐటీయూ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్ పట్టణ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు సీఐటీయూ పోరాట పాటలు పాడుతూ, కార్మిక బతుకమ్మ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు.కార్మికులు బతుకమ్మ ఆడుతున్న సమయంలో మున్సిపల్ కమిషనర్ విద్యుత్ సరఫరా నిలిపివేసి ఆటకు ఆటంకం కలిగించారని యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి జె. రాజేందర్ మాట్లాడుతూ, కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, బకాయి ఉన్న రూ.1.40 కోట్ల పీఎఫ్ మొత్తాన్ని తక్షణమే జమ చేయాలని డిమాండ్ చేశారు. పండుగ పూట కూడా వేతనాలు ఇవ్వకుండా కార్మిక కుటుంబాలను పస్తులుంచడం సబబేనా అని ప్రశ్నించారు. పట్టణ ప్రజలకు నిరంతరం సేవలందించే కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం అన్యాయమన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న కార్మికుల బతుకమ్మ ఆటకు విద్యుత్ నిలిపివేయడం సరైన చర్య కాదని విమర్శించారు. అధికారులు వెంటనే స్పందించి వేతనాలు, పీఎఫ్ బకాయిలతో పాటు ఇతర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.