ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల హక్కుల పరిరక్షణ, కులం, సామాజిక నేపథ్యం ఆధారంగా వివక్షకు తావులేకుండా సమగ్ర చట్టం రూపొందించే అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించడం జరిగింది.
విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడం, వివక్షను నిరోధించడం, విద్యాసంస్థల్లో న్యాయబద్ధమైన వాతావరణాన్ని బలోపేతం చేయడం ఈ ప్రతిపాదిత చట్టం ప్రధాన లక్ష్యాలు. ఈ దిశగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ నేతృత్వంలో న్యాయశాఖ, విద్యాశాఖ, హోంశాఖ, యూజీసీ తదితర సంస్థల భాగస్వామ్యంతో కమిటీ ఏర్పాటు చేసి, అవసరమైన న్యాయపరమైన, సాంకేతిక అంశాలను సమగ్రంగా పరిశీలించాలని నిర్ణయించాం.
విద్యార్థులు, అధ్యాపకులు, న్యాయ నిపుణులు, విద్యారంగ నిపుణులు, పౌర సమాజ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వివక్షకు సంబంధించిన అంశాలు, చట్ట అమలులో ఎదురయ్యే సవాళ్లను పరిగణనలోకి తీసుకుని బిల్లు ముసాయిదాను రూపొందించాల్సిన అవసరాన్ని సమావేశంలో చర్చించాం. ఈ ప్రక్రియలో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నైపుణ్యాన్ని కూడా వినియోగించుకోవాలని నిర్ణయించాం.
ప్రాథమిక బిల్లు ముసాయిదాను మూడు నెలల్లోగా సిద్ధం చేసి సీనియర్ సివిల్ సర్వెంట్ల కమిటీకి సమర్పించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. విద్యార్థుల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ కల్పిస్తూ, వివక్షకు తావులేని విద్యా వాతావరణాన్ని నిర్మించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రతి విద్యార్థికి సమాన గౌరవం, సమాన అవకాశాలు, న్యాయం అందేలా ఈ చట్ట రూపకల్పన ప్రక్రియ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.