సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల భూములకు సంబంధించిన అంశంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. సందర్భంగా రెండు గ్రామాల పరిధిలో జరిపిన సర్వే వివరాలను అధికారులు వివరించారు.
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 325లో రికార్డుల ప్రకారం మొత్తం 388 ఎకరాల భూమి ఉండగా, రెవెన్యూ అధికారుల సర్వేలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించిన విషయాన్ని తెలిపారు. ఆ సర్వే నంబర్‌లో 45 ఎకరాల భూమి కనిపించడం లేదని చెప్పారు.
ఆ గ్రామాల పరిధిలో లెక్కలోకి రాని 45 ఎకరాల భూమి ఎక్కడుందో తేల్చాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆ మేరకు లెక్కలోకి రాని భూమిని గుర్తించడానికి ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
భూముల సరిహద్దుల్లో ఉన్న కుటుంబ సభ్యులకు చెందిన భూముల రెవెన్యూ రికార్డులు సమర్పించాలని నోటీసులు జారీ చేయనున్నారు.
సర్వే నంబర్ 325లో ఉన్న భూమిని స్థానిక అర్హులైన రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. సర్వే నంబర్ 325లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలని సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు.
తెలంగాణ అమరవీరుల కాలనీలో అమరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, అన్ని సౌకర్యాలతో కాలనీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కాలనీ నిర్మాణ బాధ్యతలను గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలని చెప్పారు. జూన్ 2 తేదీలోగా అమరవీరుల కాలనీ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు