PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 6:09 pm Posted by : PORU TELANGANA

పోలీసులమంటూ వ్యాపారి కిడ్నాప్.. రూ.15 కోట్ల డిమాండ్.. రూ.1.3 కోట్లు వసూలు

 

హైదరాబాద్‌లో పోలీసులమంటూ ఓ 53 ఏళ్ల నగల వ్యాపారిని కిడ్నాప్ చేసిన ముఠా.. కుటుంబ సభ్యుల నుంచి రూ.15 కోట్లు డిమాండ్ చేసి, రూ.1.3 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అక్టోబర్ 5న రామంతాపూర్‌లోని తన నగల దుకాణానికి వెళ్తున్న కే శ్రీనివాసరావును గోల్నాక ఫ్లైఓవర్ సమీపంలో కిడ్నాప్ చేసి, కళ్లకు గంతలు కట్టి గుర్తుతెలియని ప్రాంతానికి తరలించినట్లు విచారణలో వెల్లడైంది.

బోడుప్పల్‌లోని హేమానగర్ రియల్ ఎస్టేట్ వెంచర్ వివాదమే కిడ్నాప్‌కు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడు దుమావత్ శ్రీకాంత్.. గుంజపోగు సురేష్ అలియాస్ సూర్య, సూరి, శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆగస్టులోనే కిడ్నాప్‌కు ప్లాన్ చేసినట్లు గుర్తించారు.

చిక్కడపల్లి పోలీసులు, సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా 10 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.07 కోట్ల నగదు, 118.26 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదు వాహనాలు, తొమ్మిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నంబర్ ప్లేట్లతో వాహనాలు మార్చుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు ముఠా ప్రయత్నించింది.

 

ప్రధాన నిందితుడు శ్రీకాంత్‌పై గతంలో 16 చీటింగ్ కేసులు ఉండగా, సురేష్‌పై ఆస్తి నేరాలు, దొంగతనాలు, దోపిడీలు, కిడ్నాప్ కేసులు ఉన్నాయి. మరో నిందితుడు బండారి శాంసన్ అలియాస్ లక్కీపై ఐదు ఆస్తి నేరాలున్నాయి. శ్రీనివాస్ రెడ్డితో సహా ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, మిగిలిన డబ్బు రికవరీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.