PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 8:26 pm Posted by : PORU TELANGANA

ప్రజలకు ప్రాథమిక సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు అభివృద్ధి, సంక్షేమ పనులను గడువులోగా పూర్తి చేయాలి తాగునీటి సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలి రూ.57.69 కోట్లతో 9 పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా ఆధునికీకరిస్తున్నాం 10 వేల మంది మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి కల్పించేలా నైపుణ్య శిక్షణ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిశానిర్దేశం

జమలాపురం: ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను హెచ్చరించారు.

ఆదివారం ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని వాసిరెడ్డి ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి వివిధ శాఖల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, అధికారులు బాధ్యతగా, జవాబుదారీతనంతో ప్రజలకు సేవలందించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామాల్లో తాగునీటి సరఫరాపై పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని, ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వానికి తావులేదన్నారు.

రూ.57.69 కోట్లతో 9 మోడల్ స్కూళ్లు

మధిర నియోజకవర్గంలో 9 పాఠశాలలను అన్ని సదుపాయాలతో మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు రూ.57.69 కోట్లు మంజూరు చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు. పాఠశాలల ఆధునికీకరణ, మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేసి విద్యార్థులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

బ్రిడ్జి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బ్రిడ్జిల నిర్మాణ పనుల్లో ఆలస్యం జరగకుండా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. పనులు ఆలస్యమైతే ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతాయని, నిర్ణీత గడువులోగా రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు.

10 వేల మంది మహిళలకు నైపుణ్య శిక్షణ

మెప్మా ఆధ్వర్యంలో మధిర పట్టణంలోని 10 వేల మంది మహిళలకు వివిధ రంగాల్లో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా నైపుణ్య శిక్షణ అందించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న రంగాలను గుర్తించి వాటిలో శిక్షణ అందించడం ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించాలన్నారు.

అభివృద్ధి పనులకు విద్యుత్ స్తంభాలు అడ్డంకి కాకూడదు

రహదారుల విస్తరణతో పాటు ఇతర అభివృద్ధి పనులకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాల తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయం లోపించి అభివృద్ధి పనులు ఆలస్యం కాకుండా చూడాలని స్పష్టం చేశారు.

భూ రీ-సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి

భూ రీ-సర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రజల నుంచి ఫిర్యాదులకు తావులేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. రీ-సర్వే అనంతరం భూ రికార్డుల నమోదును కూడా అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని ఆదేశించారు.

ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి, సంక్షేమ లక్ష్యాలను అధికారులు గడువులోగా పూర్తి చేయడంతో పాటు ప్రతి పనిలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు టీ. మధుసూదన్, వీ. మోహన్ రావు, సీఈ గౌతం రెడ్డి, ఎస్ఈ శ్రీనివాసాచారి, పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, తహశీల్దార్ సునీత ఎలిజబెత్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.