PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 8:18 pm Posted by : PORU TELANGANA

ఓటును కాపాడండి.. దేశాన్ని కాపాడండి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

 

జగిత్యాల, అక్టోబర్ 06:

ఇండియా కూటమి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో మిత్రపక్షాల నాయకులతో నిర్వహించిన “ప్రజాస్వామ్య పరిరక్షణ వారోత్సవం – ఓటును కాపాడండి, దేశాన్ని కాపాడండి” కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని పెద్ద సంఖ్యలో ప్రజల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత విలువైన హక్కు అని, ఓటు హక్కును కాపాడుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమేనని మంత్రి అన్నారు. ఎన్నికల జాబితాల్లో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా పారదర్శకమైన ప్రక్రియ ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాల మార్పులు, తొలగింపుల విషయంలో ప్రజలకు పూర్తి స్పష్టత ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

 

బీజేపీ నాయకులు పొద్దున లేవగానే దేవుడి పేరు చెప్పడం, మతాల పేరుతో రాజకీయాలు చేయడం తప్ప ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని మంత్రి విమర్శించారు. మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలకు స్వస్తి పలకాలని అన్నారు. దేశ ప్రజలందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లే రాజకీయాలు అవసరమని పేర్కొన్నారు.

 

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజల ఓటు హక్కును ఎవరైనా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. యువత, విద్యార్థులు, ప్రజాసంఘాలు ప్రజాస్వామ్య పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలని, ప్రజల ఓటుతోనే ప్రభుత్వాలు ఏర్పడతాయని మంత్రి తెలిపారు. “ఓటును కాపాడండి.. దేశాన్ని కాపాడండి” అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు.

ప్రజల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా కూటమి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాలను కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మిత్రపక్షాల నాయకులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.