PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 7:20 pm Posted by : PORU TELANGANA

అమెరికా రహదారిపై ఆగిపోయిన మరిపెడ బిడ్డ జీవితం.. సుప్రజ దుర్మరణం

*అమెరికా రహదారిపై ఆగిపోయిన మరిపెడ బిడ్డ జీవితం.. సుప్రజ దుర్మరణం…!*

పోరుతెలంగాణ డిజిటల్ మీడియా (ప్రతినిధి మరిపెడ):-రెస్టారెంట్ మూసేసి ఇంటికి బయలుదేరిన కొద్దిసేపటికే మృత్యువు ఒడిలోకి..
ట్రక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి.. భర్త, కుమారుడిని వదిలి తిరిగిరాని లోకాలకు పయనం

మరిపెడ: అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన దారం సుప్రజ మృతి చెందారు. ఈ విషాద ఘటనతో మరిపెడలోని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సెయింట్ లూయిస్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తున్న సుప్రజ.. రాత్రి రెస్టారెంట్ మూసివేసిన అనంతరం తన స్నేహితురాలితో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. కొద్దిసేపటికే వారు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్ ఢీకొట్టింది.

ఈ ఘోర ప్రమాదంలో సుప్రజ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమెతో పాటు కారులో ఉన్న స్నేహితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

సుప్రజకు భర్త, కుమారుడు ఉన్నారు. విదేశాల్లో జీవనం సాగిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్న ఆమె అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో స్వగ్రామమైన మరిపెడలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె మృతిని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరవుతున్నారు.