పోరు తెలంగాణ న్యూస్//హైదరాబాద్
తెలంగాణలో ప్రభుత్వ ధాన్యం మళ్లింపు ఆరోపణలు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. 2021–22 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.6,700 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం అక్రమంగా పక్కదారి పట్టినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈ భారీ వ్యవహారంపై లోతుగా దృష్టి సారించిన దర్యాప్తు సంస్థ, రాష్ట్రంలోని వివిధ రైస్ మిల్లుల ఆర్థిక లావాదేవీలపై విచారణను మరింత ముమ్మరం చేసింది.
మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన ప్రాంగణాల్లో తనిఖీలు..
దర్యాప్తులో భాగంగా మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు సంబంధించిన రైస్ మిల్లుతో పాటు నివాసంలో ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.30 లక్షల నగదు, పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్‌తో పాటు మరికొన్ని రైస్ మిల్లుల కార్యకలాపాలపైనా అధికారులు విచారణను కొనసాగిస్తున్నారు.
3 వేలకుపైగా మిల్లుల చిట్టా పరిశీలన..
ప్రభుత్వం మిల్లింగ్ కోసం కేటాయించిన ధాన్యానికి, మిల్లర్లు తిరిగి అప్పగించిన బియ్యానికి మధ్య ఉన్న తేడాలను నిగ్గుతేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 300 రైస్ మిల్లుల్లో విజిలెన్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. దీనికి తోడు 3 వేలకుపైగా మిల్లులకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, ధాన్యం కేటాయింపులు మరియు బియ్యం అప్పగింతల లెక్కలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
అక్రమ ఆస్తుల జప్తుపై ఈడీ దృష్టి..
ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించి, ఆ అక్రమ సొమ్ముతో కూడబెట్టిన ఆస్తులపై ఈడీ ప్రత్యేకంగా గురిపెట్టింది. ఈ అక్రమ ఆదాయాన్ని ఎక్కడెక్కడ పెట్టుబడులుగా మళ్లించారనే కోణంలో లోతుగా ఆరా తీస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా సమకూర్చుకున్న ఆస్తులను గుర్తించి, వాటిని జప్తు చేసే దిశగా దర్యాప్తు వేగవంతం కావడంతో రాష్ట్రంలోని రైస్ మిల్లర్ల వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.