తలసేమియా వ్యాధి నిర్మూలన సామాజిక బాధ్యత
– బాధిత చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన వేడుక
– సంకల్ప వార్షికోత్సవంలో సీటీసీ అడిషనల్ డీసీపీ ఈ.విజయ్‌బాబు, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్
ఖమ్మం, ఆగస్టు 30 : చిన్నారుల చిరునవ్వుల వెనుక దాగి ఉన్న బాధను గుర్తించడం.. వారి కళ్లలోని కన్నీటిని తుడిచి ఆశల వెలుగులు నింపడం.. రక్తం కోసం ఎదురుచూసే తలసేమియా చిన్నారులకు జీవితంపై భరోసా కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని, తలసేమియా కేవలం ఒక కుటుంబ సమస్య కాదని, సమాజం మొత్తం స్పందించాల్సిన మానవీయ సమస్య అని సీటీసీ అడిషనల్ డీసీపీ విజయ్ బాబు అన్నారు.
సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ 16వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఖమ్మం నగరంలోని కోణార్క్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. సంస్థ ఫౌండర్ అనిత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీటీసీ అడిషనల్ డీసీపీ ఈ. విజయ్‌బాబు మాట్లాడుతూ… తలసేమియా వ్యాధి నిర్మూలనకోసం విస్తృత అవగాహనతో సామాజిక ఉద్యమం అవసరం అన్నారు. ఒక్క రక్తపు చుక్క.. ఓ చిన్నారి జీవితానికి ఆశాకిరణం అన్నారు. తలసేమియా వ్యాధి నిర్మూలనకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా తీసుకొని పనిచేయాలని, బాధిత చిన్నారులకు అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన వేడుక అని అడిషనల్ డీసీపీ విజయ్ బాబు పేర్కొన్నారు. కేవలం వార్షికోత్సవాలు జరుపుకోవడమే కాకుండా, తలసేమియా బాధితుల సంఖ్యను తగ్గించేందుకు విసృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సంకల్ప సంస్థ గత 16 ఏళ్లుగా అందిస్తున్న సేవలు మార్గదర్శనీయం అని కొనియాడారు. రక్తం కొరతతో ఏ ఒక్క తలసేమియా చిన్నారి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పోలీస్ శాఖ తరఫున ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తున్నామని, భవిష్యత్తులోనూ తమ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. రక్తదానం చేయడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడవచ్చనే అవగాహనను ప్రతి ఒక్కరిలోనూ పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. తలసేమియా బాధితులకు మెరుగైన జీవనాన్ని, భరోసాన్ని అందించడమే మనందరి ప్రధాన లక్ష్యం కావాలని ఆకాంక్షించారు.

పిల్లల ఆరోగ్యంతో పాటు ఉన్నత భవిష్యత్తు ముఖ్యం :
సమాజంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను అధిగమిస్తూ పిల్లలు ఉన్నతమైన భవిష్యత్తును సాధించాలని ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (జీజీహెచ్) డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. సొంత కుటుంబ సభ్యుల సమస్యలనే పట్టించుకోలేని వర్తమాన సమాజంలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు రవి, అనిత బాధ్యతాయుతంగా 16 ఏండ్లుగా తలసేమియా చిన్నారుల కోసం సేవలు అందించడం గొప్ప విశేషమన్నారు. పిల్లలను సమాజంలో ఇతరులతో సమానంగా చూడాలని, వారి ఆరోగ్యం, భవిష్యత్తు పట్ల సమాజం సానుకూల దృక్పథంతో ముందుకు రావాలన్నారు.
పిల్లలతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా డాక్టర్ కిరణ్ కుమార్ తలసేమియా చిన్నారులతో నేరుగా ముచ్చటించి, వారి భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల తమ లక్ష్యాలను సాధించాలని, పూర్తి ధైర్యవంతులుగా ఎదగాలని సూచించారు. ఏఆర్ ఆర్‌ఐ కామరాజు మాట్లాడుతూ… తలసేమియా చిన్నారులకు ఎప్పుడు రక్తం అవసరమైనా రక్తదానం చేసేందుకు తాము సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇంతటి గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహించే సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థకు సహకారం అందిండం ద్వారా తాము సేవలో భాగం అవుతున్నామని, ఇది మానసిక సంతృప్తినిస్తుందని అన్నారు. అనంతరం రక్తదాతలను, చిన్నారుల కోసం సంస్థకు సహకారం అందిస్తున్న దాతలను ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో చిన్నారులు తమ ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డి.నారాయణమూర్తి, డాక్టర్ లక్ష్మీదీప, సంస్థ ఉపాధ్యక్షురాలు పి.పావని, ప్రముఖ విద్యావేత్తలు భాగ్య, మమత, సామాజికవేత్త అనురాధ, సంస్థ బాధ్యులు పి.రవిచందర్, పి.ఉదయ్‌భాస్కర్, ఆర్.కస్తూరి, పి.వంశీకిరీటి, సువర్ణకుమారి, ఏఆర్ కానిస్టేబుల్ క్రిష్ణ, ప్రముఖ జర్నలిస్ట్ నెల్లూరి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

