రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
జగిత్యాల//తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ధర్మపురి పర్యటనను విజయవంతం చేయాలని సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పర్యటిస్తారని తెలిపారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ధర్మపురి చేరుకుంటారని మంత్రి తెలిపారు. ధర్మపురి లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి గార్డెన్స్ లో నిర్వహించే సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొంటారని మంత్రి వివరించారు. ఆదివారం రాత్రి ధర్మపురిలో బస చేసి సోమవారం తెల్లవారు జామున 2గంటల 30నిముషాలకు ధర్మపురిలో రూ.10కోట్లతో ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్ నిర్మాణ పనులను భట్టి విక్రమార్క ప్రారంభిస్తారని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్ నిర్మాణ పూజ అనంతరం ఉప ముఖ్యమంత్రి సోమవారం ఉదయం 5గంటల 30నిముషాలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారని మంత్రి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనను ధర్మపురి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.

