హైదరాబాద్: అబ్దుల్లాపూర్ మెట్
హైదరాబాద్ నగర శివారులో భారీగా చలామణి చేసేందుకు సిద్ధం చేసిన నకిలీ కరెన్సీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో ఏకంగా రూ.6.7 కోట్ల ముఖ విలువ కలిగిన నకిలీ నోట్లు బయటపడటం తీవ్ర కలకలం రేపింది.
నలుగురి అరెస్ట్..
విశ్వసనీయ సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నకిలీ కరెన్సీని రహస్యంగా తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకుని సోదాలు చేయగా కోట్ల రూపాయల దొంగ నోట్లు లభ్యమయ్యాయి. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.6.7 కోట్ల నకిలీ కరెన్సీతో పాటు వాహనాన్ని, మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. ఇంత భారీ మొత్తంలో నకిలీ నోట్లు ఎక్కడి నుంచి ముద్రించి తీసుకువచ్చారు, వారి వెనుక ఉన్న బడా బాబులు ఎవరు అనేది విచారణలో తెలియాల్సి ఉంది.

