రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024 నుంచి బకాయి ఉన్న డీఏల్లో రెండు డీఏలను వెంటనే మంజూరు చేయాలని నిర్ణయించింది. ఎరియర్స్‌ను వాయిదాల్లో చెల్లిస్తారు.
✅ ఆర్థికంగా భారమైనప్పటికీ ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా రూ.2500 కోట్ల భారం పడనుంది.
✅ రాష్ట్రంలో ఎల్‌నినో కారణంగా తలెత్తిన పరిస్థితులపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. ప్రస్తుత వర్షాకాలంలో దాదాపు 17 శాతం వర్షపాతం లోటు ఉంది. నిన్నటితో రుతుపవనాల కాలం కూడా ముగిసింది. దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయి.
✅ కరువు ప్రాంతాల్లో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ సబ్‌కమిటీలో సమగ్రంగా చర్చించాలని సమావేశం నిర్ణయించింది. ఈ అంశంపై త్వరలోనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. రైతు సంఘాలతో పాటు వివిధ రంగాల నిపుణులతో భేటీలు ఏర్పాటు చేస్తారు.
✅ మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్ , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాకు వెల్లడించారు.
✅ ఎల్‌నినో పరిస్థితులు, చేపట్టాల్సిన ఉపశమన చర్యలపై అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కరువు మండలాల ప్రకటనతో పాటు రాష్ట్రానికి తగిన సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు మంత్రుల బృందం తొందరలోనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను నివేదించాలని మంత్రిమండలి నిర్ణయించింది.
✅ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు తగిన ఏర్పాట్లు చేయాలి. త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. ఈ సీజన్‌లో దాదాపు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని పౌర సరఫరాల విభాగం అంచనా వేసింది. కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం.
✅ ఎల్‌నినో పరిస్థితులతో నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో సాధారణంగా ఒక్క రోజుకు 15,000 మెగావాట్ల విద్యుత్తు వినియోగం ఉండగా.. ఈ సీజన్‌లో అది రికార్డు స్థాయిలో 19,892 మెగావాట్ల పీక్ డిమాండ్‌కు చేరింది. గత ఏడాది మొత్తంలో 16,613 మెగావాట్ల గరిష్ఠ వినియోగం నమోదైంది.
✅ విద్యుత్తు డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్తు ఉత్పత్తి, తగినంత విద్యుత్తు సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్తు కోత లేకుండా సరఫరా చేసేందుకు అవసరమైనంత విద్యుత్తును సమకూర్చుకోవాలని, డిమాండ్ మేరకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
✅ భవిష్యత్తు డిమాండ్, అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్తగా పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి, విద్యుత్తు సమీకరణపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. దాదాపు 7,800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంగా యూనిట్లు నెలకొల్పేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
✅ ఇందులో 3,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు, 4,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, 800 మెగావాట్ల పవన విద్యుత్తు యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించింది. కేంద్ర నిబంధనల మేరకు బిడ్డింగ్ విధానంలో ఈ ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది.
✅ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఈ మార్కెట్ ఏర్పాటు చేయాలని సూచించింది.
✅ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పున: సమీక్షించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈపీసీ విధానంలో చేపట్టిన ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉంటే రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా 10 ఈపీసీ సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
✅ తెలంగాణలో డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్‌కు ప్రత్యేక పాలసీ అమలు చేసే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ రూపొందించిన డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ పాలసీకి అనుగుణంగా రాష్ట్రంలో ఈ పాలసీ రూపొందించారు.
✅ న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ పోస్టుతో పాటు మరో నలుగురు గ్రూప్ 1 అధికారులను కూడా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పని చేసేందుకు నియమించాలని మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

