ప్రజలు, ఉద్యోగుల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ఉద్యోగులు, అధికారులకు సైబర్ నేరాలు,ఆన్లైన్ మోసాలు,సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
పెద్దపల్లి జోన్, రామగుండం సర్కిల్, ఎన్టీపీసీ పోలీసులు, రామగుండం సైబర్ క్రైమ్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & హెడ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఫియాజ్ టైయబ్, పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ.. ఎన్టీపీసీ సంస్థకు, స్థానిక పోలీసులకు మధ్య గత 40–50 సంవత్సరాలుగా కొనసాగుతున్న సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సూచించారు. ఎన్టీపీసీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో కార్యక్రమాల నిర్వహణకు ముందస్తు ప్రణాళిక, సమన్వయం ఎంతో అవసరమని తెలిపారు.
సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రత్యేక కేంద్రాల ద్వారా వ్యవస్థీకృతంగా మోసాలకు పాల్పడుతున్నారని కమిషనర్ హెచ్చరించారు. అధిక వేతనాలు, ఆకర్షణీయమైన ఉద్యోగాల పేరుతో యువతను ప్రలోభపెట్టి, వారిని సైబర్ నేరాలకు పాల్పడేలా చేస్తున్నారని తెలిపారు.
ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన కల్పించడం పోలీసుల బాధ్యత అని,యువ ఇంజనీర్లు తమ సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను సైబర్ నేరాల నివారణకు, సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని పిలుపునిచ్చారు.
సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సందేహాస్పద సందేశాలు, లింకులు, ఫోన్ కాల్స్ లేదా డబ్బు బదిలీకి సంబంధించిన అభ్యర్థనలు వచ్చినప్పుడు తొందరపడి స్పందించకుండా “ఆగండి.. ఆలోచించండి.. నిర్ధారించుకోండి” అనే విధానాన్ని పాటించాలని సూచించారు.
సైబర్ నేరగాళ్లు ప్రజల భయం, అత్యాశ, బలహీనతలు, అత్యుత్సాహాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. ఇతరులు ఎదుర్కొన్న సైబర్ మోసాల నుంచి పాఠాలు నేర్చుకుని, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే విధానాలకు సంబంధించిన వీడియోలను ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించి, ఉద్యోగులు మరియు అధికారులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, సిసిపిఎస్ ఏసీపీ రంగా రెడ్డి, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ కుమార్,ఎన్టీపీసీ ఎస్ఐ వెంకట్, ఎన్టీపీసీ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

