కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రత్యేక హెల్త్ క్యాంప్ నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షుడు గద్దల రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు.
కాలనీలోని పలు కుటుంబాల్లో జ్వరం, జలుబు, గొంతునొప్పి వంటి అనారోగ్య సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులతో పాటు మెడికల్ దుకాణాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు. సీజనల్ వ్యాధులు మరింత విస్తరించకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
“ప్రజలు అనారోగ్యంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకముందే అధికారులు కాలనీలోకి వచ్చి వైద్య సేవలు అందించాలి. ప్రతి ఇంటిని సందర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, అవసరమైన వారికి అక్కడికక్కడే మందులు అందించాలి” అని రామకృష్ణ కోరారు.
పంచాయతీ, వైద్యారోగ్యశాఖ సిబ్బంది సమన్వయంతో ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించి, జ్వరాలతో బాధపడుతున్న వారిని గుర్తించాలని సూచించారు. అలాగే కాలనీలో పారిశుధ్య లోపాలు, నిల్వ నీరు, దోమల సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరారు.
“జ్వరాలు ముదిరిన తర్వాత స్పందించడం కంటే.. వ్యాధులు వ్యాప్తి చెందకముందే నివారణ చర్యలు చేపట్టడం ముఖ్యం. ఎస్సీ కాలనీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు తక్షణమే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలి” అని గద్దల రామకృష్ణ కోరారు.

