తీపి జ్ఞాపకాలతో ఆత్మీయ సమ్మేళనం.. గురువులకు కృతజ్ఞతలు
ఖమ్మం: ఖమ్మం పట్టణంలోని శ్రీ విద్య ఇంటర్ కాలేజీ 2002–2004 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. స్థానిక మారమ్మ తల్లి ఆలయం సమీపంలోని అనుమూల దశవంత్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులంతా 22 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరి తమ కళాశాల రోజుల మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థి దశలో కలిసి చదువుకున్న రోజులు, స్నేహితులతో గడిపిన క్షణాలు, పండుగ సెలవుల్లో ఆటపాటలతో గడిపిన సమయం, కళాశాలలో జరిగిన వివిధ కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు. సెల్‌ఫోన్లు, ఆధునిక డిజిటల్ పరికరాలు అందుబాటులో లేని రోజుల్లో చదువుకే ప్రాధాన్యతనిస్తూ, స్నేహబంధాలకు విలువనిస్తూ గడిపిన కాలాన్ని గుర్తుచేసుకుని ఆనందం వ్యక్తం చేశారు.
కొత్త సినిమాలు విడుదలైనప్పుడు స్నేహితులంతా కలిసి సినిమాలకు వెళ్లిన సందర్భాలు, కళాశాలలో చేసిన సరదాలు, అప్పటి విద్యావిధానం, ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులకు ఉన్న గౌరవం వంటి అంశాలను పరస్పరం పంచుకున్నారు. అప్పట్లో నిర్వహించిన విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలు తమలోని ప్రతిభను వెలికితీసి, మేధాశక్తిని పెంపొందించేందుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు.
తమ జీవితాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులను ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకున్నారు. గురువులు అందించిన విద్యాబోధన, క్రమశిక్షణ, విలువలు తమ ప్రస్తుత జీవితానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
2002–2004 బ్యాచ్‌కు చెందిన పలువురు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ రంగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కలుసుకోవడం తమకు ఎంతో ఆనందాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు. పాత స్నేహాలను పునరుద్ధరించుకుంటూ, భవిష్యత్తులోనూ ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

