పోరు తెలంగాణ అక్టోబర్ 06: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.

ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడికి అవకాశం
పెంచికల్పేట్ మండలంలోని అగర్గూడ గ్రామ రైతులు కేంద్ర ప్రభుత్వ కపాస్ క్రాంతి మిషన్ ద్వారా పత్తి విత్తనాలు పొందారు. వారి పత్తి చేలను పరిశీలించేందుకు మంగళవారం సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు వ్యవసాయ అధికారులతో కలిసి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ, బొక్కి వాగు దాటి వెళ్లారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, అధిక సాంద్రతతో నాటిన పత్తి మొక్కలతో అధిక దిగుబడి సాధ్యమవుతుందని, ఎకరానికి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పత్తి సాగులో దిగుబడి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్ను ప్రవేశపెట్టిందని, దీని ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలతో పాటు పిచికారీ మందులను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారని వివరించారు. అనంతరం అగర్గూడ గ్రామపంచాయతీ భవనంలో రైతులకు బయో స్టిములెంట్ మందులు, దోమ నివారణ మందులను ఉచితంగా పంపిణీ చేశారు.ఎమ్మెల్యేగా గత మూడేళ్లుగా రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని, యూరియా, డీఏపీ సరఫరాను క్రమబద్ధీకరించామని హరీష్ బాబు తెలిపారు. వరి, పత్తి, మక్క రైతులకు పూర్తిస్థాయిలో మద్దతు ధర లభిస్తోందని, గతంలో మాదిరిగా అడ్డగోలు కటింగ్లు లేకుండా చేశామని చెప్పారు. గ్రామాలు, పట్టణాలు ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి వైపు సాగుతున్నాయని, అక్రమ కేసులు, భూకబ్జాలు లేకుండా చూశామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అగర్గూడ సర్పంచ్ అల్లూరి రాజేశ్వరి, జిల్లా వ్యవసాయ అధికారి డా. వెంకటి, ఏఓ రామకృష్ణ, వ్యవసాయ శాస్త్రవేత్త డా. మధు, తదితరులు పాల్గొన్నారు.

