జీఎస్టీ అమలు కోసం రాష్ట్రాలు తమ పన్ను విధించే స్వతంత్ర అధికారాల్లో గణనీయమైన భాగాన్ని వదులుకున్నాయని, ఆ సమయంలో ఏర్పడిన విశ్వాసాన్ని కేంద్రం–రాష్ట్రాలు కలిసి కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
న్యూఢిల్లీలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలతో పాటు జీఎస్టీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, ప్రజానుకూలంగా మార్చాల్సిన అవసరంపై కీలక అంశాలను ప్రస్తావించారు.
జీఎస్టీ తెలంగాణ సొంత పన్ను ఆదాయంలో సుమారు 35 శాతం వాటా కలిగి ఉందన్నారు. ఈ ఆదాయమే విద్య, వైద్యం, సంక్షేమం, మౌలిక వసతులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చులకు కీలక ఆధారమన్నారు. జీఎస్టీ ఆదాయంలో తగ్గుదల కేవలం లెక్కల్లో కనిపించే లోటు కాదని.. ప్రజలకు సేవలందించే రాష్ట్ర సామర్థ్యంపై నేరుగా ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్రాల ఆదాయంపై గణనీయమైన ప్రభావం చూపే మార్పులు చేసే ముందు వాటి పూర్తి ఆర్థిక ప్రభావాన్ని వెల్లడించాలని కోరారు. మోటార్ వాహనాలకు సంబంధించిన ప్రతిపాదిత మార్పుల వల్ల తెలంగాణకు జీఎస్టీ కౌన్సిల్ గణాంకాల ప్రకారం ఏడాదికి సుమారు రూ.800 కోట్ల ఆదాయ ప్రభావం ఉంటుందని అంచనా వేయగా, రాష్ట్రం చేసిన అంచనాల ప్రకారం ఈ నష్టం రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
స్క్రాప్ రంగంలో పన్ను ఎగవేతను అరికట్టాలి
అసంఘటిత, నగదు ఆధారిత నిర్మాణం కారణంగా స్క్రాప్ రంగంలో నకిలీ ఇన్వాయిస్‌లు, నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ వంటి అక్రమాలు జరుగుతున్నాయన్నారు. జీఎస్టీ వ్యవస్థ విశ్వసనీయతను కాపాడేందుకు దీనిపై సమగ్ర చర్యలు అవసరమన్నారు.
అదే సమయంలో స్క్రాప్ రంగంపై ఆధారపడి జీవిస్తున్న చెత్త సేకరించే కార్మికులు, చిన్న స్థాయి సేకరణదారుల జీవనోపాధికి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సామాన్య ప్రజల ఆధార్, పాన్ వివరాలను దుర్వినియోగం చేసి వారి పేర్లపై నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు సృష్టించడం తీవ్రమైన సమస్యగా మారిందన్నారు.
స్క్రాప్ రంగంలోని పన్ను ఎగవేత, గుర్తింపు దొంగతనం సమస్యలను సమగ్రంగా పరిశీలించేందుకు మంత్రుల బృందాన్ని (GoM) ఏర్పాటు చేయాలని తెలంగాణ డిప్యూటీ సీఎం ప్రతిపాదించారు. పేదలు, అసంఘటిత రంగ కార్మికులు, సాధారణ పౌరుల ప్రయోజనాలను కాపాడేలా పరిష్కారాలు సూచించాలని కోరారు.
జీఎస్టీ కమిటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పించాలి…
దేశంలోనే అత్యంత చురుకైన, పటిష్టమైన పన్ను ఆధారాలు (ట్యాక్స్ బేస్) కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరిస్తున్న జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) కౌన్సిల్ ఉప కమిటీల్లో తెలంగాణకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌లో GSTN ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయాలి..
టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో హైదరాబాద్‌కు ఉన్న సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో GSTN, జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్‌కు ప్రాంతీయ స్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
చివరగా, జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం కేంద్రానిదీ, రాష్ట్రానిదీ మాత్రమే కాదని.. అది ప్రజల సొమ్మని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని కాపాడే విధంగా కేంద్రం, రాష్ట్రాలు కలిసి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రాల హక్కులు, ప్రజల ప్రయోజనాలు, ఆర్థిక సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతూ జీఎస్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

