బతుకమ్మ ఆడిన మహిళలకు బహుమతులు అందజేసిన టీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి కావేటి సబిత….

పోరు తెలంగాణ అక్టోబర్ 11: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.
కాగజ్నగర్: పట్టణంలోని ఓల్డ్ కాలనీలో ఉన్న ఉమామహేశ్వర ఆలయ ప్రాంగణంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి కావేటి సబిత పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ మహిళలు ఆటపాటలతో సందడి చేశారు. ఉమామహేశ్వర ఆలయ ప్రాంగణం బతుకమ్మ పాటలతో, మహిళల కోలాహలంతో పండుగ శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా కావేటి సబిత మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఉత్సాహంగా బతుకమ్మ ఆడిన మహిళలకు బహుమతులు అందజేశారు. మహిళలను ప్రోత్సహిస్తూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ వేడుకలు చాటిచెప్పాయి.తెలంగాణ ఆడపడుచులకు ఎంతో ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జరుపుకోవడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించవచ్చని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. ఓల్డ్ కాలనీలో నిర్వహించిన ఈ వేడుకలు మహిళల్లో ఆనందాన్ని నింపాయి.

