వరంగల్,* తెలంగాణలో వైవాహిక వివాదాల నేపథ్యంలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి వరంగల్ జిల్లా కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. రంగంపేటకు చెందిన దత్తు శ్రీనివాస్ హత్య కేసులో భార్యతో పాటు ఆమె కుటుంబంలోని మరో 9 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మల గీతాంబ గారు తీర్పు ఇచ్చారు.
అసలు ఏం జరిగింది?*
రంగంపేటకు చెందిన దత్తు శ్రీనివాస్ కు, వరంగల్ నగరంలోని రంగశాయిపేటకు చెందిన బజ్జూరి రమ్యశ్రీకి 2015లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. అయితే పెళ్లయిన ఏడాదిలోపే ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో రమ్యశ్రీ పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత భర్త, అతని కుటుంబ సభ్యులపై పలు కేసులు నమోదు చేయించింది. ఆ కేసులను శ్రీనివాస్ కుటుంబం కోర్టులో ఎదుర్కొంటూ వచ్చింది.
పండుగ పేరుతో పిలిచి…*
ఈ వివాదాలు కొనసాగుతున్న క్రమంలోనే, 2024 ఫిబ్రవరి 13వ తేదీన బొడ్రాయి పండుగ ఉంది, కలిసి జరుపుకుందాం, ఉన్న సమస్యలకు ఫుల్ స్టాప్ పెడదాం అని అత్తింటివారు శ్రీనివాస్ ను ఇంటికి ఆహ్వానించారు. భార్యను తిరిగి కాపురానికి తీసుకెళ్లవచ్చనే ఆశతో శ్రీనివాస్ అత్తగారింటికి వెళ్లారు.
కోర్టు విచారణలో ఏం తేలింది?*
అక్కడ జరిగిన ఘర్షణలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో, అవే కీలక సాక్ష్యాధారాలుగా మారాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు.
దాదాపు రెండేళ్ల పాటు సాగిన విచారణ అనంతరం, న్యాయమూర్తి అన్ని సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నేరం రుజువైందని భావించి, భార్య రమ్యశ్రీ, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితురాలు అలేఖ్యతో సహా మొత్తం 10 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
ఈ తీర్పుతో వరంగల్ లో ఒక్కసారిగా ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. వైవాహిక వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

