తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, విద్యార్థుల అభ్యసన స్థాయిలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్యానల్ ఇన్స్పెక్షన్ బృందం బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించి సమగ్రంగా తనిఖీ నిర్వహించింది.నోడల్ అధికారి కే. శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించిన ఈ తనిఖీలో ఉపాధ్యాయుల బోధనా విధానం,సిలబస్ పూర్తి చేసిన తీరు, విద్యార్థుల అభ్యసన స్థాయిలు తదితర అంశాలను బృందం పరిశీలించింది. అలాగే పాఠశాలలోని మౌలిక వసతులు,మధ్యాహ్న భోజన నాణ్యత, పాఠశాల పారిశుధ్యం, కిచెన్ గార్డెన్, ఖాన్ అకాడమీ ద్వారా డిజిటల్ బోధన, టీ.ఎల్.ఎం.ల వినియోగం, క్రీడల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించడంతో పాటు సంబంధిత పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు.విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన స్థాయిలను అంచనా వేసిన ప్యానల్ బృందం, విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన సూచనలు చేసింది.విద్యార్థులలో అభ్యసన ఫలితాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని సూచించింది.ఈ తనిఖీ బృందంలో గంట అశోక్, తెడ్డు చిన్నయ్య,పి. గంగా మోహన్,గంగాధర్,ఆర్. గంగాధర్,కె.రమేష్,డి.విశ్వనాథ్, వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్. గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు రాజేశ్వర్, సీనియర్ ఉపాధ్యాయులు ఎం. ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.


