పోరు తెలంగాణ అక్టోబర్ 08: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భూముల రీ సర్వేను పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ కె. హరిత ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, గిర్దావర్లు, జీపీవోలు, రెవెన్యూ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదన్నారు. తహసీల్దార్ నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ రీ సర్వేపై అవగాహన కలిగి ఉండాలని, డీజీపీఎస్ రోవర్ల ద్వారా కొలతలు చేసే విధానాన్ని తెలుసుకుంటే క్షేత్రస్థాయి సర్వేలో ఇబ్బందులు ఉండవని సూచించారు. ప్రభుత్వ ఆస్తులు, భూముల సర్వేను పక్కాగా చేపట్టాలని, దీనివల్ల భవిష్యత్తులో హద్దుల వివాదాలు లేకుండా రెవెన్యూ రికార్డులను కచ్చితంగా నిర్వహించవచ్చని తెలిపారు.

