ఉకే శిరీష కుటుంబానికి అండగా మంత్రి పొంగులేటి ఎమ్మెల్యేలు పాయం , జారే కోరం తెల్లం
ములకలపల్లి సెప్టెంబర్ 4 పోరు తెలంగాణ జిల్లా ప్రతినిధి కూరపాటి దాసు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఉకే శిరీష ఇటీవల హైదరాబాద్‌లో దారుణ హత్యకు గురైన నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆమె స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా శిరీష కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు.
ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయం చెక్కును, అలాగే ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను బాధిత కుటుంబానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఆదివాసీ కుటుంబానికి చెందిన శిరీష కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
హైదరాబాద్ తుక్కుగూడలో చోటుచేసుకున్న శిరీష హత్య ఘటన అమానుషమని, మానవ రూపంలో ఉన్న మృగం చేసిన దారుణ హత్యగా పేర్కొంటూ సభ్య సమాజం తలదించుకునే ఘటన అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సీపీతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి , ఘటనకు బాధ్యుడైన వ్యక్తిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా శిరీష నివాసం ఉన్న ఆసుపత్రి వసతి గృహంలో సమగ్ర విచారణ చేపట్టి, నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి తో మాట్లాడుతానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, కుటుంబానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు , జారే ఆదినారాయణ తెల్లం వెంకట్రావు , కోరం కనకయ్య జిల్లా కలెక్టర్ అంకిత్ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

