పోరు తెలంగాణ నవంబర్ 02: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.కాగజ్‌నగర్ మండలంలోని బోరిగాం శివారులో ఉన్న ప్రధాన నాలాను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్న రమేష్ కోరుతూ కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్‌కు నవంబర్ 2న ఫిర్యాదు అందజేశారు. కాగజ్‌నగర్ మండల పరిధిలోని ఎన్‌జీవో కాలనీ గ్రామపంచాయతీ పరిధిలో, మధుర హాస్పిటల్ పక్కన సర్వే నంబర్ 144/1లో ప్రధాన నాలాను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోకి వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఈ నాలాను ఆక్రమించడం వల్ల భవిష్యత్తులో వర్షాకాలంలో వరద నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నాలాకు ఇరువైపులా చేపట్టిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి, నాలా స్థలాన్ని, ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరారు. గతంలో పలుమార్లు కాగజ్‌నగర్ ఎంపీడీవో, ఇరిగేషన్ డివిజన్-3 డీఈఈ, డీటీసీపీ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఫిర్యాదుదారులు పొన్న రమేష్ తెలిపారు.ఈ నేపథ్యంలో మరోసారి సబ్ కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. నాలా ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపి, అక్రమ నిర్మాణాలకు అనుమతులు జారీ చేసిన అధికారుల పాత్రపై కూడా విచారణ చేపట్టాలని కోరారు. బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకొని నాలాలు, ప్రభుత్వ భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

